టీడీపీ కాకినాడ రూరల్ డాక్టర్స్ కమిటీ అధ్యక్షుడిగా రాయుడు అనిల్ నియామకం
కాకినాడ రూరల్: తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నియామకాన్ని వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా కాకినాడ రూరల్ మండల టీడీపీ డాక్టర్స్ కమిటీ అధ్యక్షుడిగా రమణయ్యపేటకు చెందిన మాజీ ఎంపీటీసీ, ఆర్‌ఎంపీ వైద్యుడు రాయుడు అనిల్‌ను నియమించారు. రాయుడు అనిల్ గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ సేవలందించడంతో పాటు, ఆర్‌ఎంపీ వైద్యుడిగా నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ గుర్తింపు పొందారు. అలాగే అవసరమైన సందర్భాల్లో ప్రముఖ వైద్యులతో సమన్వయం చేసి పేద రోగులకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందేలా సహకరిస్తూ సామాజిక సేవలో ముందుంటున్నారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ నాయకత్వం డాక్టర్స్ కమిటీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా రాయుడు అనిల్ మాట్లాడుతూ, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను గుర్తించి తగిన బాధ్యతలు అప్పగించడం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత అని అన్నారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించిన కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా మరింత బాధ్యతతో పనిచేస్తూ వైద్యుల సమన్వయంతో ప్రజలకు సేవలందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Comments
Post a Comment