నీట్, మెగా డీఎస్సీ అవకతవకలపై నిరసన ర్యాలీకి విద్యార్థులు, యువత ముందుకు రావాలి: ఉంగరాల సంతోష్
కాకినాడ : నీట్ పరీక్ష, మెగా డీఎస్సీ పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలు, పేపర్ లీకేజీలు, విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి వంటి సమస్యలపై ఈ నెల 28న నిర్వహించనున్న నిరసన ర్యాలీలో విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి ఉంగరాల సంతోష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం కేవలం వైఎస్సార్‌సీపీకి సంబంధించినది కాదని, రాష్ట్రంలోని విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న అన్యాయాలకు వ్యతిరేకంగా చేపడుతున్న ప్రజా నిరసన అని ఆయన పేర్కొన్నారు. అప్పులు చేసి పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రుల ఆవేదనను దృష్టిలో ఉంచుకుని, వారి పిల్లల భవిష్యత్తు కోసం ఈ ఉద్యమం చేపడుతున్నట్లు తెలిపారు. మెగా డీఎస్సీ నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ వ్యవహారంలో బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకురాకపోతే భవిష్యత్తులో నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజీతో పాటు మెగా డీఎస్సీ అవకతవకల వల్ల నష్టపోయిన విద్యార్థులు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి, ప్రభుత్వం హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతిని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Comments
Post a Comment