బాపన్నదొర కాలనీలో నేత్ర వైద్య శిబిరం
కాకినాడ రూరల్ : కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామంలోని బాపన్నదొర కాలనీ సామాజిక భవనంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ వైద్యులు 260 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, అవసరమైన 160 మందికి ఉచితంగా కళ్లద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాటికాయల వీరబాబు మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం సామాజిక బాధ్యత అని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కాలనీ అధ్యక్షుడు ఎ. దిలీప్ కుమార్ వర్మ మాట్లాడుతూ, కాలనీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకుడు రామిశెట్టి సునీల్, కాలనీ ఉపాధ్యక్షుడు ఎం. అశోక్ చౌదరి, కార్యదర్శి కృష్ణమోహన్, కోశాధికారి ఉదయభాస్కర్, సభ్యులు డాక్టర్ గరికిపర్తి నమశ్శివాయ, కేఎస్‌ఎన్, బర్రె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment