గురువే ప్రత్యక్ష దైవం.. గురు పౌర్ణమి సందర్భంగా మోహన్‌కు ఘన సన్మానం
కాకినాడ: స్థానిక ఈశ్వర్‌నగర్‌లోని మోహన్ కాన్వెంట్ వ్యవస్థాపకులు మోహన్‌ను గురు పౌర్ణమి సందర్భంగా ప్రముఖ దంత వైద్య నిపుణులు డా. అడ్డాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ గురువులు కేవలం పాఠాలు చెప్పేవారు మాత్రమే కాదని, భావి భారత పౌరులను తీర్చిదిద్దే శిల్పులని అన్నారు. ప్రతి డాక్టర్, ఇంజనీర్, శాస్త్రవేత్త, నాయకుడి విజయానికి వెనుక గురువు కృషి ఉంటుందని, విద్యార్థుల్లోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని వెలిగించేవారే గురువులని పేర్కొన్నారు. పాఠ్యాంశాలతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సమాజంలో ఎలా జీవించాలో గురువులే బోధిస్తారని, విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదిగితే తల్లిదండ్రులతో సమానంగా ఆనందించేది గురువేనని అన్నారు. డా. అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ మోహన్ విద్యా రంగంలో ఎన్నో ఏళ్లుగా వేలాది మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన ఆదర్శ గురువని కొనియాడారు. అన్ని వృత్తుల్లో గురు వృత్తి అత్యంత పవిత్రమైనదని, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అనే భారతీయ సంస్కృతి గురువుకు విశిష్ట స్థానం కల్పించిందన్నారు. ఆషాఢ పౌర్ణమి రోజున వేదవ్యాస మహర్షి జయంతి సందర్భంగా గురు పౌర్ణమిని జరుపుకుంటామని, అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే మహనీయుడే గురువని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ స్నేహ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments
Post a Comment