పిల్లి దంపతుల ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి శ్రీకారం

కాకినాడ రూరల్: రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలతో ప్రత్యక్ష అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో అధికార తెలుగుదేశం పార్టీ చేపట్టిన 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమానికి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సోమవారం ఘనంగా శ్రీకారం చుట్టారు. టీడీపీ కాకినాడ రూరల్ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో నేమం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా నేమం గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ఆరంభించారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి వివరించి ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై కరపత్రాలను పంపిణీ చేశారు. గత రెండేళ్లలో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు, ప్రజలకు అందిన ప్రయోజనాలను వివరించడంతో పాటు స్థానిక సమస్యలు, ప్రజల సూచనలను తెలుసుకుని నమోదు చేశారు. ప్రత్యేకంగా సూపర్ 6 హామీల అమలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, యువతకు ఉపాధి అవకాశాలు, విద్యార్థులకు విద్యా ప్రోత్సాహం, సామాజిక భద్రత పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రచారంగా కాకుండా ప్రజల అభిప్రాయాలు, స్థానిక సమస్యలను తెలుసుకునే వేదికగా కూడా వినియోగించుకుంటున్నట్లు నాయకులు తెలిపారు. ప్రజల నుంచి వచ్చే సూచనలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 రోజుల పాటు కొనసాగే 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పనితీరును ప్రతి ఇంటికి చేర్చడంతో పాటు ప్రజలతో పార్టీ అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నూరుకుర్తి వెంకటేశ్వర రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కర్రీ వెంకట్రాజు, క్లస్టర్ లు సరిదే నాగ హరినాథ్, పేరాబత్తుల లోవబాబు,ప్రకాష్, నేమం గ్రామ పార్టీ అధ్యక్షులు గుబ్బల శివ, వాసంశెట్టి లోవరాజు, సీనియర్ నాయకులు మాసుమెను గంగయ్య, కాళ్ళ శ్రీనివాస్, కొమరిశెట్టి నరసింగరావు,వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...