డీఎస్సీ ఆరోపణలు రుజువు చేస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా....పేరాబత్తుల రాజశేఖర్

కాకినాడ రూరల్  : మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ అన్నారు. కాకినాడ రూరల్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి అక్రమాలు లేదా లొసుగులు జరగలేదని స్పష్టం చేశారు. ఒకవేళ వైసీపీ నాయకులు తమ ఆరోపణలను ఆధారాలతో రుజువు చేస్తే తాను ఎమ్మెల్సీ పదవికి తక్షణమే రాజీనామా చేయడానికి సిద్ధమని బహిరంగ సవాల్ విసిరారు.కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు పూర్తిగా కట్టుబడి ఉందని, ఏదైనా పొరపాటు జరిగితే నైతిక బాధ్యత వహించడానికి వెనుకాడదని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి అంశాన్ని ప్రభుత్వం విస్మరించలేదని, భృతి ఇవ్వడం కంటే యువతకు శాశ్వత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకువచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిరుద్యోగ భృతి సహా ఎన్నికల హామీల అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే స్పష్టత ఇస్తారని వెల్లడించారు. కొత్తగా అర్హత పొందిన లబ్ధిదారులకు వచ్చే నెల నుంచి గృహ సంబంధిత ప్రయోజనాలు అందజేస్తామని, ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...