మానవ సేవే నిజమైన ఆధ్యాత్మికత
కాకినాడ రూరల్ : మానవత్వమే దివ్యత్వానికి తొలి మెట్టని, ఆధ్యాత్మిక సాధన ద్వారా ప్రశాంత జీవితం సాధ్యమవుతుందని స్ఫూర్తి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలోని ప్రజ్ఞా ఫంక్షన్ హాల్‌లో గురు విశ్వస్ఫూర్తి దివ్య ఆశీస్సులతో కాకినాడ స్ఫూర్తి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఆసనాలు, ప్రాణాయామం, ధ్యాన సాధనలు నిర్వహించి మానవత్వం, ఆత్మజ్ఞానం, ఇంద్రియ నిగ్రహం, ప్రశాంత జీవన విధానంపై ఆధ్యాత్మిక సందేశాలు అందించారు. కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ మానవత్వంతో ఆదరించడమే నిజమైన ఆధ్యాత్మికత అని వక్తలు తెలిపారు. హిందూస్థాన్ షిప్‌యార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ డి. శ్రీనివాసరావు, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ తరపట్ల సత్యనారాయణ, మాధవరపు వీర రాఘవ రాము ప్రసంగిస్తూ ధ్యాన సాధనతో శారీరక, మానసిక ప్రశాంతతతో పాటు ఆధునిక ఆధ్యాత్మిక జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం సమాజంలోని వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను స్ఫూర్తి కుటుంబ సభ్యులు శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. భక్తులకు మహాప్రసాదం పంపిణీ చేయగా, నిత్యజీవిత సమస్యల పరిష్కారానికి అవగాహన సదస్సులు కూడా నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, స్ఫూర్తి కుటుంబ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


Comments
Post a Comment