ద్రితి ఫౌండేషన్ ట్రస్ట్ సహకారంతో బ్రూణహత్యల నివారణకు అవగాహన కార్యక్రమాలు.. డాక్టర్ శుభ శేఖర్ రెడ్డి


కాకినాడ : లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, ఆడ శిశువు అని గుర్తించి గర్భస్రావం చేయించడం చట్టరీత్యా నేరమని, అయినప్పటికీ కొందరు తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగా ఇటువంటి సంఘటనలు ఇంకా జరుగుతుండటం అత్యంత బాధాకరమని బ్లూ రైన్ హాస్పిటల్స్ అధినేత, ద్రితి ఫౌండేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ శుభ శేఖర్ రెడ్డి అన్నారు.బ్లూ రైన్ హాస్పిటల్స్ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ద్రితి ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రూణహత్యల నివారణ కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా గర్భధారణ, ప్రసవం లేదా నవజాత శిశువుల వైద్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అవసరమైన వైద్య సేవలు, ఆర్థిక సహాయం అందించేందుకు ట్రస్ట్ కట్టుబడి ఉందన్నారు.''ఆడపిల్లలు వద్దు" అనే ఆలోచన సమాజ భవిష్యత్తుకు ప్రమాదకరమని పేర్కొంటూ, మహిళలు ప్రతి రంగంలోనూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. మహిళా క్రీడాకారిణులు, శాస్త్రవేత్తలు, అంతరిక్ష పరిశోధకులు, పరిపాలన రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాలు ప్రతి కుటుంబానికి స్ఫూర్తిగా నిలవాలని అన్నారు.నగరంలోని ప్రధాన కూడళ్లలో "ఆడపిల్లను కాపాడండి – భవిష్యత్తును రక్షించండి" అనే సందేశాలతో ప్రత్యేక ప్రచార హోర్డింగులు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నామని తెలిపారు.ద్రితి ఫౌండేషన్ ట్రస్ట్ సేవలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని పేర్కొంటూ, ట్రస్ట్ మరియు బ్లూ రైన్ హాస్పిటల్స్ అందిస్తున్న సేవలకు గుర్తింపుగా లభించిన ప్రత్యేక అవార్డు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.ఇప్పటివరకు 1.1 కిలోగ్రాముల కంటే తక్కువ బరువుతో జన్మించిన 152 మంది అత్యంత క్లిష్ట స్థితిలో ఉన్న నవజాత శిశువులను విజయవంతంగా కాపాడగలిగామని, ఇది నిష్ణాతులైన వైద్య బృందం, అంకితభావంతో పనిచేస్తున్న సిబ్బంది, ద్రితి ఫౌండేషన్ ట్రస్ట్ అందించిన అండదండల ఫలితమని డాక్టర్ శుభ శేఖర్ రెడ్డి పేర్కొన్నారు.ఇలాంటి అరుదైన వైద్య విజయాలపై పరిశోధనా పత్రాలు సిద్ధం చేసి జాతీయ, అంతర్జాతీయ వైద్య జర్నల్స్‌కు పంపించనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా గ్లోబల్ రూనర్ శాటిలైట్ మిషన్‌లో జాతీయ స్థాయికి ఎంపికైన ధవళేశ్వరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని కందుల జెస్సికి అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 20 మంది విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కరే ఎంపిక కావడం రాష్ట్రానికి గర్వకారణమని, ఆమె విజయం బాలికలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...