వెన్నుపోటు గుర్తుకురాలేదా.. మేయర్ కుర్చీ ఎక్కినప్పుడు..
ఇటీవల నిర్వహించిన ర్యాలీలో మాజీ మేయర్ సుంకర శివ ప్రసన్న ముఖ్యమంత్రి చంద్రబాబును వెన్నుపోటుదారుడిగా అభివర్ణించడంపై స్పందించిన నేతలు, “2017లో చంద్రబాబు, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సహకారంతోనే కార్పొరేటర్‌గా గెలిచి, అనంతరం మేయర్ పదవి చేపట్టావు. అప్పుడు వెన్నుపోటు గుర్తుకు రాలేదా?” అంటూ ప్రశ్నించారు.
ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా బయట విమర్శలు చేయిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ హయాంలో ప్రతిపక్షాలపై అరెస్టులు, ఆంక్షలు ఉండేవని, ప్రస్తుతం ప్రజాస్వామ్య వాతావరణంలో ఎవరికైనా ర్యాలీలు నిర్వహించే స్వేచ్ఛ ఉందన్నారు.
కూటమి రెండేళ్ల పాలనలో రాష్ట్ర రహదారుల పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, గతంలో తిరుపతికి వెళ్లేందుకు 10 గంటలు పట్టేదని, ఇప్పుడు కేవలం 5 గంటల్లో చేరుతున్నామని తెలిపారు. ఇది కూటమి ప్రభుత్వ అభివృద్ధికి నిదర్శనమన్నారు.
సూపర్ సిక్స్ హామీలు విజయవంతంగా అమలవుతున్నాయని, తల్లికి వందనం, స్త్రీశక్తి, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని కొప్పనాతి నాగకుమారి పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ఎదురవుతున్న సమస్యలు ప్రభుత్వ వైఫల్యం కాదని, గ్యాస్ కంపెనీల సాంకేతిక కారణాల వల్లే కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయని వివరించారు.
ఉపాధ్యాయులు, కానిస్టేబుళ్ల నియామకాలు కూటమి ప్రభుత్వంలోనే జరిగాయని, వైసీపీ పాలనలో ఉద్యోగాల భర్తీ నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. మహిళలు స్వేచ్ఛగా బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితులు వైసీపీ హయాంలో ఉండేవని, ఇప్పుడు శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని పీర్ల లక్ష్మీ ప్రసన్న అన్నారు.

Comments
Post a Comment