పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై చర్యలు శూన్యం.. అధికారుల తీరుపై మాజీ ఎంపీటీసీ ఆగ్రహం
కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న పలు అక్రమాలపై సుమారు తొమ్మిది నెలల క్రితం ఫిర్యాదులు చేసినప్పటికీ నేటికీ వాటిపై చర్యలు శూన్యంగానే ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత అంశాలపై నిర్వహించిన విచారణ నివేదికలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు సమర్పించి మూడు నెలలు గడిచినా కింది స్థాయి అధికారులపై చర్యలు తీసుకోకపోవడం వల్ల ఫిర్యాదులు పెండింగ్‌లోనే ఉన్నాయని విమర్శించారు.
ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకంతో దూర ప్రాంతాల నుంచి ఫిర్యాదుదారులు వస్తున్నప్పటికీ, వారికి ఎంత మేర న్యాయం జరుగుతోందన్నది ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ రూరల్ ప్రాంత సమస్యలపై కూడా దృష్టి సారించాలని కోరారు. తూరంగి గ్రామపంచాయతీలో నకిలీ ఇంటి పన్నులు, అనధికారిక నిర్మాణాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, అనధికారిక లేఅవుట్లపై ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడం విచారకరమన్నారు.
పబ్లిక్ గ్రీవెన్స్‌కు వచ్చే అర్జీదారులకు న్యాయం జరగని పక్షంలో సంబంధిత శాఖ అధికారులు, జిల్లా అధికారులపై లోకాయుక్తకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ ఎంపీటీసీ పితాని వెంకటరాము తెలిపారు.

Comments
Post a Comment