అనపర్తి అభివృద్ధికి మరో అడుగు..

అనపర్తి   :  గ్రామంలో రూ.1.20 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఎర్రకాలువ వంతెన నుంచి సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వరకు రూ.80 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించగా, రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రంథాలయ భవన నిర్మాణానికి రామచంద్ర పేపర్ మిల్స్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధుల నుంచి రూ.20 లక్షలు, మిగిలిన నిధులను మండల పరిషత్ ద్వారా సమకూరుస్తున్నారు. బీటీ రోడ్డు పనులు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం–పల్లె పండుగ 2.0 కింద చేపట్టారు.

ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. బీటీ రోడ్డు నిర్మాణంతో గ్రామ ప్రజలకు, సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుందని తెలిపారు. నూతన గ్రంథాలయ భవనం విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎస్‌ఆర్ కింద నిధులు అందించిన రామచంద్ర పేపర్ మిల్స్ యాజమాన్యాన్ని అభినందించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రహదారి సౌకర్యాల మెరుగుదలతో ప్రజలకు రవాణా సౌలభ్యం పెరగడంతో పాటు స్థానిక ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. ఆధునిక గ్రంథాలయ భవనం నిర్మాణంతో విద్యార్థులు, యువతకు విజ్ఞాన వనరులు మరింత చేరువవుతాయని తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సీఎస్‌ఆర్ నిధుల వినియోగం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆర్.కె.రెడ్డి, తహసీల్దార్లు అనిల్ కుమార్, రమాదేవి, పాపారావు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...