మహిళా సెక్యూరిటీ గార్డులపై దాడి ఘటనలో దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి: ఏఐటీయూసీ

కాకినాడ: కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ విమర్శించారు. ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధ సంఘం) ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్) ప్రధాన ద్వారం వద్ద మహిళా సెక్యూరిటీ గార్డులపై జరిగిన దాడికి నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూనియన్ నాయకులు, సెక్యూరిటీ గార్డులు హాజరయ్యారు.ఈ సందర్భంగా తోకల ప్రసాద్ మాట్లాడుతూ మార్చి 6న జీజీహెచ్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా సెక్యూరిటీ గార్డులపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఇప్పటివరకు పూర్తి స్థాయి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. బాధితులపై దాడి చేసిన వారిని అధికారులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో సెక్యూరిటీ గార్డులు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ, వారి భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఘటన జరిగిన మూడు నెలలు గడిచినా ఆసుపత్రి యాజమాన్యం, సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. బాధిత మహిళలకు న్యాయం చేయాలని, కేసు విచారణ వేగవంతం చేసి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.అలాగే దాడికి గురైన సెక్యూరిటీ గార్డులను విధుల నుంచి తప్పించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విధుల్లో కొనసాగించడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపించారు. సమస్య పరిష్కారం కాకపోతే దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రతినిధులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎన్. అనిల్ కుమార్, మధు, కాటూరి రాజు, రామలక్ష్మి, రమణమ్మ, జాన్ బాబు, శ్రీవల్లి, ప్రశాంతి, బొడ్డు రేవతి తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఏపీకి వర్ష హెచ్చరిక.. కోస్తాంధ్రలో భారీ వర్షాల ముప్పు

ప్రతిభకు ప్రోత్సాహం.. జూన్ 7న స్కాలర్‌షిప్ కోసం సత్య ట్రస్ట్ పరీక్ష

ద్వారంపూడి హయాంలో కాకినాడ అరాచకాలకు నిలయం: టీడీపీ నేతలు