మహానాడు కాదు దగానాడు.. జమ్మలమడక నాగమణి ధ్వజం

కాకినాడ రూరల్ : తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు ఆత్మస్తుతి, పరనిందలకే పరిమితమైందని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, మహానాడులో ప్రజా సమస్యలు, సంక్షేమం, అభివృద్ధి అంశాలపై చర్చ జరగకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యం ఇచ్చారని మండిపడ్డారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలపై చర్చించాల్సిన వేదికను చంద్రబాబు, లోకేష్, దేవాన్ష్ భజన సభగా మార్చారని వ్యాఖ్యానించారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన మహిళా రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, పింఛన్ల పంపిణీ వంటి అంశాలను గుర్తు చేసిన నాగమణి, ప్రస్తుత ప్రభుత్వం ఆ హామీలను ఎందుకు నిలిపివేసిందో ప్రజలకు సమాధానం చెప్పలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేసి చరిత్ర సృష్టించిన జగన్ చిత్తశుద్ధిని గుర్తు చేస్తూ, చంద్రబాబు కూడా రాజ్యసభ, కేబినెట్‌లో మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మెగా డీఎస్సీ పేరుతో జరిగిన అవకతవకలపై, యువతకు జరిగిన అన్యాయంపై మహానాడులో ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించకుండా జగన్‌పై విమర్శలతోనే సభ నడిచిందన్నారు. సూపర్ సిక్స్ హామీల అమలుపై కూడా స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ తీర్మానం చేయడం రాజకీయ నాటకమేనని నాగమణి వ్యాఖ్యానించారు. గతంలో అదే అంశాన్ని అడ్డుకున్న చంద్రబాబు ఇప్పుడు తీర్మానం చేయడం నందమూరి కుటుంబాన్ని మరోసారి మోసం చేయడమేనన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన డిజిటల్ మహానాడు అట్టర్ ఫ్లాప్‌గా మారిందని, సభా ప్రాంగణాలు వెలవెలబోయాయని ఆమె ఎద్దేవా చేశారు.

Comments

Popular posts from this blog

ఏపీకి వర్ష హెచ్చరిక.. కోస్తాంధ్రలో భారీ వర్షాల ముప్పు

ప్రతిభకు ప్రోత్సాహం.. జూన్ 7న స్కాలర్‌షిప్ కోసం సత్య ట్రస్ట్ పరీక్ష

ద్వారంపూడి హయాంలో కాకినాడ అరాచకాలకు నిలయం: టీడీపీ నేతలు