పాడా పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్
కాకినాడ, మే 22 : పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (పాడా) పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్, పాడా చైర్మన్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాడా, పిఠాపురం మున్సిపాలిటీ, ఆర్ అండ్ బి, పబ్లిక్ హెల్త్, డ్వామా, మత్స్యశాఖ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాడా పీడీ డా. ఎన్.వి. శివరామ్ ప్రసాద్ వివిధ శాఖల వారీగా జరుగుతున్న పనుల పురోగతిని కలెక్టర్‌కు వివరించారు. జనగణన, టెంపుల్ టూరిజం, వరదల వల్ల దెబ్బతిన్న పనుల పునరుద్ధరణ, ఉపాధి హామీ పథకం, సీసీ రోడ్లు, డ్రైన్లు, మినీ గోకులాలు, పాఠశాల అదనపు తరగతి గదులు, కాంపౌండ్ వాల్స్ తదితర అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. పాడా పరిధిలో రూ.469.23 కోట్ల అంచనా వ్యయంతో 74 రకాల అభివృద్ధి పనులు చేపట్టగా, ఇప్పటివరకు రూ.93 కోట్ల వ్యయంతో 62 పనులు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మిగిలిన పనులను వేగవంతం చేసి నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు నిర్మాణ పనులకు అనుకూలంగా ఉన్నందున శాఖల మధ్య సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఆదేశించారు. పూర్తయిన పనులకు వెంటనే క్లోజర్ ప్రక్రియ పూర్తి చేయాలని, అమలులో ఎదురయ్యే సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో ఏపీడీ వసంత మాధవి, పిఠాపురం కమిషనర్ కనకారావు, గొల్లప్రోలు కమిషనర్ శ్రీనివాసరావు, తహసీల్దార్లు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.


Comments
Post a Comment