కాకినాడలో కే టాక్స్ మాఫియా : వైసీపీ సంచలన ఆరోపణలు
కాకినాడ : రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కాకినాడ నగరంలో “కే టాక్స్” పేరుతో టీడీపీ నేతలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వైసీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే చిన్న క్రీడా మైదానం చదును పనులకు సంబంధించిన రూ.93 లక్షల టెండర్‌లో రూ.50 లక్షల వరకు గోల్మాల్ జరిగిందని ఆరోపించారు. గురువారం నగరంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం సమీపంలో ఉన్న వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైసీపీ నేతలు ఈ ఆరోపణలు చేశారు.
ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు మళ్ళా కిషోర్ మాట్లాడుతూ నగరంలో మద్యం దుకాణాలు, ఆశీలు పాటలు, రేషన్ బియ్యం కొనుగోలు, జూదం నంబర్ ఆటలు, సర్కు రవాణా బార్జీల పునరుద్ధరణల పేరుతో అదనపు వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతి మద్యం సీసాపై అదనంగా పది రూపాయలు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ అక్రమ వసూళ్ల ద్వారా ప్రతి నెల భారీ మొత్తంలో అవినీతి సొమ్ము చేరుతోందని విమర్శించారు.
జగన్నాధపురంలోని ఎంఎస్ఎన్ సేవా సంస్థల క్రీడా మైదానాన్ని తమ హయాంలో ఉచితంగా చదును చేశామని, ప్రస్తుతం అదే పనికి టెండర్ పిలిచి భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఆధారాలు లేకుండా తమపై ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించవద్దని స్థానిక టీడీపీ నాయకులకు హితవు పలికారు. సమావేశంలో వైసీపీ నాయకులు చక్క చక్రవర్తి, వాసిరెడ్డి చిన్ని, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment