అత్యవసర వైద్య సేవలపై మెడికవర్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం
కాకినాడ : ప్రపంచ అత్యవసర వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మెడికవర్ హాస్పిటల్స్, కాకినాడ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ కృష్ణ చైతన్య హాజరయ్యారు.ఈ సందర్భంగా కాకినాడ రూరల్ సీఐ కృష్ణ చైతన్య మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో సమయానికి వైద్య సేవలు అందించడం ద్వారా అనేక ప్రాణాలను రక్షించవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటులు, ఇతర అత్యవసర సందర్భాల్లో ప్రజలు భయపడకుండా వెంటనే అంబులెన్స్ సేవలను సంప్రదించాలని సూచించారు. ప్రజల్లో ప్రథమ చికిత్సపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. డాక్టర్ జయప్రకాష్, హెచ్ఓడి మరియు ఎమర్జెన్సీ ఫిజిషియన్ మాట్లాడుతూ అత్యవసర వైద్య సేవల్లో “గోల్డెన్ అవర్” ఎంతో కీలకమని వివరించారు. ప్రమాదం జరిగిన మొదటి గంటలో సరైన చికిత్స అందితే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ సీపీఆర్ మరియు ఫస్ట్ ఎయిడ్ వంటి ప్రాథమిక వైద్య పరిజ్ఞానం నేర్చుకోవాలని సూచించారు. మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ సెంటర్ హెడ్ ఎన్. అంజిబాబు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన అత్యవసర వైద్య సేవలను అందించేందుకు మెడికోవర్ హాస్పిటల్స్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందన్నారు. ఆధునిక సదుపాయాలు, నిపుణులైన వైద్య బృందంతో 24 గంటల అత్యవసర సేవలు అందిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా వేగవంతమైన వైద్య సేవలు చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అత్యవసర విభాగ వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం అత్యవసర సేవలు సిబ్బందిని సన్మానించారు. అత్యవసర వైద్య సేవల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించే పలు కార్యక్రమాలు నిర్వహించారు.

Comments
Post a Comment