ద్వారంపూడి హయాంలో కాకినాడ అరాచకాలకు నిలయం: టీడీపీ నేతలు
కాకినాడ : మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హయాంలో కాకినాడ నగరం డ్రగ్స్, గంజాయి, రౌడీయిజం, అక్రమాలకు కేంద్రంగా మారిందని, ప్రస్తుతం ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) నాయకత్వంలో నగరం అభివృద్ధి, ప్రశాంతత దిశగా పయనిస్తోందని కాకినాడ నగర టీడీపీ నాయకులు ఆరోపించారు. ఇటీవల వైసీపీకి చెందిన 22వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మల్లా కిషోర్ ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ శుక్రవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో నగర ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, డివిజన్ ఇంచార్జి పిర్ల లక్ష్మీప్రసన్న మీడియాతో మాట్లాడారు. మల్లా కిషోర్ చదువుకున్న విద్యాసంస్థల వద్ద అక్రమ మట్టిపనులు జరిగాయని, కొంతమంది అనుచరుల ద్వారా అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహించారన్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో మాదకద్రవ్యాలకు సంబంధించిన వ్యవహారాలు వెలుగుచూశాయని ఆరోపించారు. కొండబాబు హయాంలో నగరంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల ద్వారా సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థలు ఏర్పాటు చేసి శాంతిభద్రతలు మెరుగుపరిచారని తెలిపారు. ద్వారంపూడి పాలనలో నేరాలు పెరిగాయని, ప్రజలు విసిగిపోయి ఇప్పుడు వనమాడిని ఆదరిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో శీకోటి అప్పలకొండ, కొప్పనాతి నాగకుమారి, ఒమ్మి బాలాజీ తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Comments
Post a Comment