హెల్మెట్ ధరించండి.. ప్రాణాలను కాపాడుకోండి
కాకినాడ : రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కాకినాడ కల్పనా సెంటర్ వద్ద ట్రాఫిక్-1 పోలీసులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. “హెల్మెట్ ధరించి ప్రయాణిస్తే – అది మీ ప్రాణాలను కాపాడుతుంది” అనే నినాదంతో ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు జరిమానాలు విధించడం బదులుగా కొత్త హెల్మెట్లు కొనిపించి తలపై ధరింపజేయడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు మాట్లాడుతూ హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించాలని సూచించారు. ట్రిపుల్ రైడింగ్, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, మైనర్లతో వాహనాలు నడపించడం, బైక్ స్టంట్లు చేయడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. రాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదాలు అధికమవుతున్నాయని తెలిపారు. రెడ్ సిగ్నల్ సమయంలో స్టాప్ లైన్ వెనుక వాహనాలు నిలిపివేయాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆటోమేటిక్ ఫైన్ జనరేషన్ సిస్టమ్ ద్వారా ఈ-చలానాలు జారీ అవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్-1 ఇన్‌స్పెక్టర్ ఎన్. రమేష్‌తో పాటు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments
Post a Comment