రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై ఎన్‌సీసీ క్యాడెట్లకు అవగాహన
కాకినాడ, localnewsap : కాకినాడ జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జేఎన్టీయూ అలుమ్ని స్టేడియంలో 9 ఏ ఎయిర్ స్క్వాడ్రన్ (టెక్) ఎన్‌సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న రూ.1.50 లక్షల వరకు ఉచిత నగదు రహిత చికిత్స, ప్రమాదం జరిగిన ఏడు రోజులలోపు చికిత్స పొందే పీఎం రాహత్ పథకం గురించి వివరించారు. హెల్మెట్ ధరించడం అవసరం, ట్రిపుల్ రైడింగ్, బైక్ స్టంట్స్, మైనర్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలు, జీబ్రా లైన్లు లేని చోట రోడ్డు దాటే విధానం, ట్రాఫిక్ గుర్తుల ప్రాధాన్యతను డిజిటల్ తరగతుల ద్వారా వివరించారు. అలాగే ఆటోలలో పరిమితికి మించి ప్రయాణించరాదని, ఈవ్ టీజింగ్ నిషేధం, మహిళల భద్రతపై అవగాహన కల్పించారు. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు, నకిలీ రుణాలు, ఆన్లైన్ ఉద్యోగాల పేరుతో మోసాలు, డిజిటల్ అరెస్టుల వంటి సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 112, 1930, 1972 నంబర్లను వినియోగించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎన్. రమేష్, ఎన్‌సీసీ గ్రూప్ కెప్టెన్ పి. ప్రవీణ్ బాబు, ట్రాఫిక్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ బి. సత్యనారాయణతో పాటు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.


Comments
Post a Comment