మెగా డీఎస్సీపై విష ప్రచారం మానుకోండి.. వైఎస్సార్‌సీపీకి సుంకర పావని హెచ్చరిక
కాకినాడ సిటీ: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని, నిరుద్యోగుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర పావని తిరుమల కుమార్ విమర్శించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా సక్రమంగా ఇవ్వలేదని, నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర జగన్‌దేనని అన్నారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అత్యంత పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ నియామక ప్రక్రియను పూర్తి చేస్తోందని తెలిపారు. వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. డీఎస్సీ పరీక్షల్లో ఎలాంటి పేపర్ లీకేజీలు లేదా అక్రమాలు జరగలేదని, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో పరీక్షలు నిర్వహించామని చెప్పారు. అభ్యర్థుల డేటా డిలీట్ అయిందనడం గందరగోళం సృష్టించే కుట్ర మాత్రమేనని విమర్శించారు.
ఎస్‌సీఈఆర్టీ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంక్ వచ్చిందంటూ జరుగుతున్న ప్రచారం కూడా దుష్ప్రచారమేనని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సమాన అవకాశం కల్పించామని తెలిపారు. అభ్యర్థుల మెరిట్ మార్కులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఎంపికైన అభ్యర్థులకు డిజిటల్ పద్ధతిలో సమాచారం అందించడం పారదర్శకతకు నిదర్శనమని పేర్కొన్నారు.
స్పోర్ట్స్ కోటా పోస్టులను అమ్ముకున్నారన్న ఆరోపణలను కూడా ఆమె ఖండించారు. క్రీడా ధృవీకరణ పత్రాలను స్క్రీనింగ్ కమిటీ ద్వారా కఠినంగా పరిశీలించి అర్హులైన వారికి మాత్రమే ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. వైసీపీ హయాంలో జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు.
విద్యాశాఖ మంత్రి Nara Lokesh పర్యవేక్షణలో విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. సీబీఐ విచారణల గురించి మాట్లాడే అర్హత వైఎస్సార్‌సీపీ నేతలకు లేదని, ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. ఇప్పటికైనా నిరుద్యోగుల భవిష్యత్తును రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం మానుకోవాలని సుంకర పావని హెచ్చరించారు.

Comments
Post a Comment