మహిళా సెక్యూరిటీ గార్డులపై దాడి కేసులో దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి: ఏఐటీయూసీ
కాకినాడ : మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ & సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో మార్చి 6న మహిళా సెక్యూరిటీ గార్డులపై జరిగిన దాడి ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించి పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. విధులు నిర్వహిస్తున్న మహిళా సెక్యూరిటీ గార్డులపై దాడి జరగడం సిగ్గుచేటని, బాధ్యులపై వెంటనే చార్జిషీట్ దాఖలు చేసి అరెస్టు చేయాలని ఆయన కోరారు. దాడి ఘటనలో ఆర్ఎంసీలో పనిచేస్తున్న శివగంగ, ఆమె కుమారుడు మరియు బయటి నుంచి వచ్చిన వ్యక్తుల పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం చార్జిషీట్‌లో ఉన్న శివగంగను రంగరాయ మెడికల్ కళాశాల విధుల నుంచి తొలగించాలని కూడా కోరారు. ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి రోజూ వేలాది మంది పేద ప్రజలు వైద్య సేవల కోసం వస్తుంటారని, అలాంటి ప్రశాంత వాతావరణంలో మహిళా సిబ్బందిపై దాడులు జరగడం ఆందోళనకరమన్నారు. రామలక్ష్మి, రాజులపై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ధర్నా అనంతరం డీఆర్వోకు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. అలాగే ఎస్సీ, ఎస్టీ కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని డీఎస్పీని కలిసి కోరినట్లు చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్. అనిల్ కుమార్, మధు, కాటూరి రాజు, శ్రీవల్లి, లోవ, వెన్నకోటి శ్రీదేవి, వి. శ్రీనివాస్, డి. రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment