అక్రమ మట్టి రవాణాపై ఉక్కుపాదం: ఎమ్మెల్యే నల్లమిల్లి హెచ్చరిక

 

పెదపూడి, LocalNewsAp : మట్టి రవాణా పేరుతో ప్రకృతి సంపదను, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. పెదపూడి పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల మండలంలో అక్రమ మట్టి రవాణా అధికమైందని, భారీ వాహనాలతో రోడ్లు ధ్వంసం కావడమే కాక కాలువ గట్లు కూడా దెబ్బతింటున్నాయని తెలిపారు. కంకణాలకోడు డ్రెయిన్ గట్టును కూడా తవ్వుతున్నారనే విషయాన్ని కమ్యూనిస్టు నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు.
ఇటీవల ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పర్యటన సందర్భంగా గ్రామస్తులు సమస్యలను వివరించారని, అనంతరం తహసీల్దార్, ఎస్ఐలతో సమీక్షించి అక్రమ మట్టి రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించినట్లు వెల్లడించారు. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి రెండు ప్రోక్లైనర్లు, ఏడు లారీలను సీజ్ చేసినట్లు తెలిపారు. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అక్రమ మట్టి రవాణా చేసే వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని ఎమ్మెల్యే హెచ్చరించారు. రైతులు తమ పొలాల్లో మట్టి సర్దుబాటు పనులు చేసుకుంటున్న సమయంలో కొందరు బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. బయట నీతులు చెప్పే వారిలోనే కొందరు అవినీతిలో భాగస్వాములుగా ఉన్నారనే సమాచారం ఉందని, పూర్తి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. తన పేరు, కూటమి నాయకులు లేదా అధికారుల పేర్లు చెప్పి ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ప్రజలు నమ్మవద్దని, వెంటనే సమాచారం అందించాలని కోరారు. నిజాయితీ గల రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చట్టప్రకారం రక్షణ కల్పిస్తామని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పెదపూడి మండల కూటమి నాయకులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఏపీకి వర్ష హెచ్చరిక.. కోస్తాంధ్రలో భారీ వర్షాల ముప్పు

ప్రతిభకు ప్రోత్సాహం.. జూన్ 7న స్కాలర్‌షిప్ కోసం సత్య ట్రస్ట్ పరీక్ష

ద్వారంపూడి హయాంలో కాకినాడ అరాచకాలకు నిలయం: టీడీపీ నేతలు