డీఎస్సీ అక్రమాలపై ఎస్వీయూ దగ్గర వైఎస్సార్ విద్యార్థి విభాగం నిరసన. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్.

తిరుపతి : డీఎస్సీ-2026లో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. దగా డీఎస్సీని వెంటనే రద్దు చేయాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ నియామకాలలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కో ఉద్యోగాన్ని రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఓసీ ఓపెన్ కటాఫ్ ప్రకటించకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం చేశారని విమర్శించారు. మెరిట్‌లో వచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను కూడా రిజర్వేషన్ కోటాలో మాత్రమే ఎంపిక చేశారని, ఓపెన్ కేటగిరిలో అన్యాయం జరిగిందన్నారు. ఓపెన్ కేటగిరి కటాఫ్ మార్కులను వెంటనే వెల్లడించాలని డిమాండ్ చేశారు.

చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ వ్యవహారంపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. స్పోర్ట్స్ కోటాలో అదనపు కోటా కలిపి అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. సుమారు 3.50 లక్షల మంది డీఎస్సీ పరీక్ష రాస్తే, అధికారులకు అనుకూలంగా ఉన్నవారికే ఉద్యోగాలు కల్పించారని విమర్శించారు. భారీ స్థాయిలో అవినీతి జరిగిందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు.

Comments

Popular posts from this blog

ఏపీకి వర్ష హెచ్చరిక.. కోస్తాంధ్రలో భారీ వర్షాల ముప్పు

ప్రతిభకు ప్రోత్సాహం.. జూన్ 7న స్కాలర్‌షిప్ కోసం సత్య ట్రస్ట్ పరీక్ష

ద్వారంపూడి హయాంలో కాకినాడ అరాచకాలకు నిలయం: టీడీపీ నేతలు