క్రీడలతో యువతలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ పెంపొందుతుంది: ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ
కాకినాడ : విద్యార్థులు, యువత క్రీడల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పేర్కొన్నారు. ప్లే యాక్సెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక లేడీస్ క్లబ్ ప్రాంగణంలోని ఇందిరా సుబ్బిరామిరెడ్డి స్టేడియంలో నిర్వహిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల బ్యాడ్మింటన్ పోటీలను శుక్రవారం ఆమె ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో యువత చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడలు శరీరాన్ని దృఢంగా ఉంచడమే కాకుండా పోటీ తత్వాన్ని, ఓర్పును, జట్టుగా పనిచేసే నైపుణ్యాన్ని పెంచుతాయని తెలిపారు. మూడు రోజుల పాటు నాకౌట్ విధానంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 500 మంది క్రీడాకారులు పాల్గొనడం సంతోషకరమన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలు కాకినాడలో నిర్వహించడం ద్వారా స్థానిక క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రతిభావంతులైన క్రీడాకారులు ముందుకు రావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తోందని, యువత తమ ప్రతిభను నిరూపించుకునే వేదికలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్లే యాక్సెస్ క్లబ్ ఆర్గనైజర్ గంటి మధు కిరణ్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో పాల్గొని పోటీలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పలువురు క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

Comments
Post a Comment