మహానాడులో ప్రజా సమస్యలపై చర్చలు ఎక్కడ? ఆత్మస్తుతి, ప్రతిపక్ష విమర్శలకే పరిమితమైందని సీపీఐ నేత తాటిపాక మధు విమర్శ
కాకినాడ జిల్లా : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికలో ఆత్మస్తుతి, ప్రతిపక్షాలపై విమర్శలు తప్ప ప్రజలకు ఉపయోగపడే అర్థవంతమైన చర్చలు జరగలేదని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు. శుక్రవారం విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన కీలక అంశాలపై ఎలాంటి చర్చలు, చర్యలు, సూచనలు, తీర్మానాలు కనిపించలేదన్నారు. ప్రజలకు ఉపయోగపడే కేజీ బేసిన్ చమురు నిక్షేపాలు, యువత ఉపాధి, కార్మిక సమస్యలు వంటి అంశాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మహానాడులో రాష్ట్ర భవిష్యత్తుపై స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రజలు ఆశించారని, అయితే ఆ స్థాయి చర్చలు జరగలేదన్నారు.రాష్ట్రానికి సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధనపై బలమైన తీర్మానం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికుల రెగ్యులరైజేషన్‌పై స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు. అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన రోడ్‌మ్యాప్ కనిపించలేదని, నిరుద్యోగ నిర్మూలన, ఉద్యోగ భద్రత అంశాలపై కూడా స్పష్టత ఇవ్వలేదన్నారు. లక్షలాది మంది యువత ఎదురుచూస్తున్న ఉద్యోగ అవకాశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సమస్యలను పక్కనపెట్టి రాజకీయ ప్రచారానికే మహానాడు పరిమితమైతే ప్రజలు భవిష్యత్తులో విశ్వాసం కోల్పోయే పరిస్థితి వస్తుందని తాటిపాక మధు హెచ్చరించారు.

Comments
Post a Comment