ఉపాధి సృష్టికి పరిశ్రమలే శక్తి.. యువతకు ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పిలుపు
కాకినాడ : రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ సహకారంతో, పనిముట్ల రూపకల్పన కేంద్ర సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాపార సంస్థల అభివృద్ధి అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పారిశ్రామికవేత్తలకు వ్యాపార విస్తరణ అవకాశాలు, ఉత్పత్తుల నాణ్యత మెరుగుదల, మార్కెట్ అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలపై సమగ్ర అవగాహన కల్పించడమే కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. యువత ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురుచూడకుండా స్వయం ఉపాధి రంగంలో అడుగుపెట్టి కొత్త పరిశ్రమలను స్థాపించి మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆమె సూచించారు. చిన్న పరిశ్రమలు బలమైన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివని, సాధికారత పొందిన పారిశ్రామికవేత్తలే సుసంపన్న సమాజ నిర్మాణానికి పునాది వేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, బ్యాంకు ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments
Post a Comment