ఎన్టీఆర్ ఆశయాలే రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచి : కటకంశెట్టి బాబి
కాకినాడ రూరల్ : తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన స్వర్గీయ నందమూరి తారకరామారావు ఆశయాలతోనే రాష్ట్ర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని కాకినాడ రూరల్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ (బాబి) అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు రెండో రోజు వేడుకలు కాకినాడ రూరల్ క్లస్టర్ ఇన్‌చార్జ్-4 పేరాబత్తుల లొవబాబు ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న సహకార శ్రీ నిలయం కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గన్ని కృష్ణ, కటకంశెట్టి వెంకట ప్రభాకర్ (బాబి) ముఖ్య అతిథులుగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులను శాలువాలతో సత్కరించారు.ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ, ఎన్టీఆర్ తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత అని కొనియాడారు. పేదల సంక్షేమం, మహిళా సాధికారత, ప్రాంతీయ ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.
కటకంశెట్టి వెంకట ప్రభాకర్ (బాబి) మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ పుట్టుకే తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం జరిగిందని తెలిపారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం టిడిపి నిరంతరం కృషి చేస్తోందన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలను విశాఖపట్నానికి తీసుకురావడం, రాయల్ ఎన్ఫీల్డ్ వంటి ప్రముఖ కంపెనీలను రాష్ట్రానికి ఆకర్షించడం చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనమన్నారు.
ఎన్టీఆర్ మహిళా సాధికారతకు బాటలు వేసిన మహానేత అని, మహిళలకు ఆస్తి హక్కులు కల్పించడం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయడం వంటి చారిత్రాత్మక నిర్ణయాలను గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో నారా లోకేష్ మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు కోసం కృషి చేస్తున్నారని తెలిపారు.
“కార్యకర్తలే పార్టీకి బలం” అనే ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని టిడిపి నేటికీ కొనసాగిస్తోందని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు, డైరెక్టర్ పోస్టులు, కమిటీ పదవుల్లో పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మట్ట ప్రకాష్ గౌడ్, యాళ్ళ రాజా, మేక లక్ష్మణరావు, బోల కృష్ణమోహన్, దేవు వెంకన్న, కౌజు నెహ్రూ, మాసినేని గంగయ్య, గేసాల శ్రీను, నురుకుర్తి వెంకటేశ్వరరావు, పితాని అప్పన్న, కంచిమర్తి లావణ్య, వాసిరెడ్డి ఏసుదాసు, దవులూరు కృష్ణకాంత్, అభిరామ్ చౌదరి, సందీప్ చౌదరి, మార్కండేయులు, దాసరి దొరబాబు తదితరులు పాల్గొన్నారు.



Comments
Post a Comment