ప్రతిభకు ప్రోత్సాహం.. జూన్ 7న స్కాలర్‌షిప్ కోసం సత్య ట్రస్ట్ పరీక్ష
కాకినాడ : సత్య చారిటబుల్ ట్రస్ట్, సత్య స్కాన్స్ అండ్ డయాగ్నస్టిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, గురుకుల పాఠశాలల విద్యార్థుల కోసం జూన్ 7న స్కాలర్‌షిప్ మెరిట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కాదా వెంకటరమణ తెలిపారు. పదో తరగతిలో 90 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని పేర్కొన్నారు.
ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు పరీక్ష నిర్వహించబడుతుందని, పరీక్ష కేంద్రాల వివరాలను పరీక్షకు రెండు రోజుల ముందు విద్యార్థులకు తెలియజేస్తామని చెప్పారు. మొత్తం 60 బహుళ ఎంపిక ప్రశ్నలతో 140 మార్కులకు పరీక్ష ఉంటుందని వివరించారు. గణితంలో 20 ప్రశ్నలకు 40 మార్కులు, సైన్స్‌లో 20 ప్రశ్నలకు 40 మార్కులు, సాంఘిక శాస్త్రం మరియు సాధారణ జ్ఞానంలో 20 ప్రశ్నలకు 60 మార్కులు కేటాయించినట్లు తెలిపారు.
పరీక్ష 10వ తరగతి సిలబస్‌తో పాటు సాధారణ జ్ఞానం ఆధారంగా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు ముఖ్యమైన పాఠ్యాంశాలను పునశ్చరణ చేసుకోవడంతో పాటు సమకాలీన అంశాలపై కూడా అవగాహన పెంచుకోవాలని సూచించారు. పరీక్ష ప్రారంభానికి కనీసం అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాలని, ప్రతిభ ఆధారంగా స్కాలర్‌షిప్‌లు అందజేయనున్నట్లు తెలిపారు.
విద్యార్థుల్లో విద్యా ప్రతిభను ప్రోత్సహించడం, ఉన్నత విద్యాభ్యాసానికి ఆర్థిక సహకారం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని డాక్టర్ కాదా వెంకటరమణ వెల్లడించారు.

Comments
Post a Comment