పిఠాపురం జనసేనలో సభ్యత్వం ఉన్నవారికి గుర్తింపు లేదా? రాజశేఖర్‌కు మద్దతుగా కార్యకర్తల ప్రశ్నలు! సభ్యత్వం ఉంటేనే పదవులు అన్న సిద్ధాంతం ఏమైంది? డాక్టర్‌కు పదవి కట్టబెట్టేందుకు అంత అత్యుత్సాహం ఎందుకు?

పిఠాపురం: జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలపై నమ్మకంతో పనిచేస్తున్న కార్యకర్తలకు పదవుల విషయంలో తగిన గుర్తింపు లభిస్తోందా? లేక కొత్తగా తెరపైకి వస్తున్న రాజకీయ సమీకరణాలకే ప్రాధాన్యం పెరుగుతోందా? పిఠాపురం మున్సిపల్ చైర్మన్ పదవిని కేంద్రంగా చేసుకుని ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తూ, సభ్యత్వంతో పార్టీతో అనుబంధం కొనసాగించిన సికోలు రాజశేఖర్‌కు చైర్మన్ పదవి దక్కాలనే డిమాండ్ ఆయన మద్దతుదారుల నుంచి వినిపిస్తోంది. ఒకప్పుడు పార్టీ సభ్యత్వం ఉన్నవారికే ప్రాధాన్యం, కష్టపడిన కార్యకర్తలకే పదవులు అంటూ చెప్పిన మాటలు ఇప్పుడు గుర్తున్నాయా? లేక అధికార, పదవుల సమీకరణాల్లో ఆ సిద్ధాంతాలు మరుగున పడుతున్నాయా? అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ సభ్యత్వం ఉందా లేదా అన్న అంశంపై స్పష్టత లేని వ్యక్తుల పేర్లు చైర్మన్ పదవి కోసం ప్రచారంలోకి రావడం, అలాంటి వారికి కొందరు ముఖ్య నాయకులు మద్దతు ఇస్తున్నారనే చర్చ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఓ వైద్యుడి విషయంలో ఒక నాయకుడు చూపిస్తున్న ప్రత్యేక ఆసక్తి వెనుక కారణాలేమిటి? ఆయనకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడానికి ఉన్న రాజకీయ సమీకరణాలేమిటి? పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసిన కార్యకర్తలను పక్కనపెట్టి కొత్తగా వచ్చిన వారికి పదవులు కట్టబెట్టాలనే ఆలోచన ఎందుకు వస్తోందని జనసైనికులు నిలదీస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రచారంపై సంబంధిత నాయకులు స్పందించాల్సి ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన వెంట నడిచిన నాయకులు, కార్యకర్తలు చేసిన త్యాగాలకు దక్కే గుర్తింపు ఇదేనా? యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తూ, ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో ముందుకొచ్చే యువకులకు అవకాశాలు కల్పించాల్సిన సమయంలో వారిని పక్కనపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అనే చర్చ కూడా మొదలైంది. “కార్యకర్తల బలమే పార్టీ బలం.. కేడర్ కోసం నిలబడాలి” అనే భావనకు ఆచరణలో ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. డబ్బు, పలుకుబడి ఉన్నవారికే పదవులు దక్కుతాయనే భావన కార్యకర్తల్లో ఏర్పడితే పార్టీ పునాదులుగా నిలిచిన కేడర్‌లో నిరుత్సాహం పెరిగే ప్రమాదం ఉందని పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చిన సామాన్య కార్యకర్తకు అవకాశం కల్పించడం ద్వారా పార్టీ తన సిద్ధాంతాల పట్ల నిబద్ధతను చాటుకోవాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిఠాపురం మున్సిపల్ చైర్మన్ ఎంపికలో పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? సికోలు రాజశేఖర్‌కు మద్దతుగా వినిపిస్తున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటారా? లేక ఇతర ఆశావహుల పేర్లను ముందుకు తీసుకొస్తారా? అన్నది వేచి చూడాల్సి ఉంది. సభ్యత్వం, పార్టీ సేవ, కార్యకర్తల కృషి పదవుల ఎంపికలో ఏ మేరకు ప్రాధాన్యం పొందుతాయో నాయకత్వ నిర్ణయమే స్పష్టం చేయనుంది.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

పిఠాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం.. సామాన్యుడికా? లేక బడా నాయకుల కనుసన్నల్లో డాక్టర్ కేనా? – తెరవెనుక రాజకీయాలపై జనసైనికుల్లో తీవ్ర ఆగ్రహం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ