పిఠాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం.. సామాన్యుడికా? లేక బడా నాయకుల కనుసన్నల్లో డాక్టర్ కేనా? – తెరవెనుక రాజకీయాలపై జనసైనికుల్లో తీవ్ర ఆగ్రహం

పిఠాపురం : పిఠాపురం మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీ (జనరల్) కేటగిరీకి రిజర్వ్ కావడంతో, నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జనసేన పార్టీ బడా నాయకులకు ఇది ప్రస్తుతం ఒక పెద్ద సవాల్‌గా మారగా, పట్టణంలో ఈ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. పార్టీ కోసం నిరంతరం శ్రమించిన నిజమైన కార్యకర్తలను కాదని, కొందరి స్వార్థ రాజకీయాల కోసం తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు జనసేన శ్రేణుల్లో పెను కలకలం రేపుతున్నాయి. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి, ప్రతి కష్టసుఖంలోనూ తోడుంటూ నిరంతరం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన సామాన్య కార్యకర్త సికోలు రాజశేఖర్‌కు ఈసారి చైర్మన్ పీఠం దక్కాలనే డిమాండ్ క్షేత్రస్థాయి నుంచి గట్టిగా వినిపిస్తోంది. పార్టీ నిర్వహించిన 'జనవాణి' కార్యక్రమంలో స్వయంగా అధినేత పవన్ కళ్యాణ్ గారి ముందే దళిత వర్గాల సమస్యలను ఎంతో ధైర్యంగా, బాధ్యతాయుతంగా వినిపించిన వ్యక్తిగా రాజశేఖర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. పిఠాపురంలో జనసేన పార్టీకి కష్టకాలంలో పునాది వేసిన నేతగా ఆయనకు పేరున్నప్పటికీ, ఆయనను కాదని పదవులు ఎగరేసుకుపోవడానికి కొందరు చేస్తున్న ప్రయత్నాలు కార్యకర్తలను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయి.
మరోవైపు పదవుల ఆశ చూపిస్తున్న తీరుపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ముందే హడావుడిగా పార్టీలోకి వచ్చి చేరిన దానం లాజరు బాబు అనే వ్యక్తికి, ఎన్నికల అనంతరం పార్టీ ఘన విజయం సాధించగానే ఏకంగా 'ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్' వంటి ప్రతిష్టాత్మక నామినేటెడ్ పోస్టును కేటాయించారు. అయినప్పటికీ సంతృప్తి చెందకుండా, ఇప్పుడు మళ్లీ మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ఆసక్తి చూపుతూ నాయకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారని, ఇది పార్టీ కోసం మొదటినుంచి పనిచేస్తున్న వారికి తీవ్ర అన్యాయం చేయడమేనని కార్యకర్తలు మండిపడుతున్నారు.
ఇక వీటిన్నింటికి మించి, స్థానిక బడా నాయకులు తమ తెలివితేటలను ఉపయోగించి మరింత విడ్డూరమైన ఎత్తుగడలకు తెరలేపారు. పార్టీ కోసం ఏనాడూ కనీసం ఒక్కరోజు కూడా కష్టపడని, పార్టీ సిద్ధాంతాలతో ఎలాంటి సంబంధం లేని ఒక వైద్యుడికి ఈ చైర్మన్ పీఠం కట్టబెట్టేందుకు కొందరు పెద్దలు పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీని నమ్ముకుని అంకితభావంతో పనిచేసిన వాళ్లను కాదని, ఎలాంటి సేవ చేయని వ్యక్తిని అకస్మాత్తుగా తెచ్చి పీఠం మీద కూర్చోబెట్టాలనే ఈ ఆలోచన పిఠాపురం జనసేన కార్యకర్తలను తీవ్రంగా కలచివేస్తోంది.
ఈ నేపథ్యంలోనే జనసేన అధినాయకుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ సిద్ధాంతాలపైనే ఇప్పుడు అందరి చూపు నిలిచింది. పవన్ కళ్యాణ్ ఆలోచన ఎప్పుడూ కూడా కష్టపడిన సామాన్య కార్యకర్తకు న్యాయం చేయాలనేదే ఉంటుంది. "కష్టపడిన వాడికే పదవి" అనే ఆయన ప్రాథమిక సూత్రం ప్రకారం, ఈసారైనా సికోలు రాజశేఖర్ లాంటి నిబద్ధత గల సామాన్యుడికి తగిన గుర్తింపు దక్కుతుందా, లేక బడా బాబుల ప్లాన్లకే పెద్దపీట వేస్తారా అనేది ఇప్పుడు పిఠాపురం జనసైనికులను తొలిచివేస్తున్న ప్రధాన ప్రశ్నగా మారింది. పార్టీ కోసం రక్తం, చెమట ధారపోసి పనిచేసిన వారిని విస్మరించి, కేవలం డబ్బు, బలాబలాలు, పలుకుబడి ఉన్నవారికే పదవులు కట్టబెడితే అది భవిష్యత్తులో పార్టీ పునాదులనే తీవ్రంగా దెబ్బతీస్తుందని సీనియర్ జనసైనికులు తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధినాయకత్వం జోక్యం చేసుకుని క్షేత్రస్థాయి పరిస్థితులను బేరీజు వేసి, నిజమైన కార్యకర్తకు న్యాయం చేయాలని పిఠాపురం ప్రజలు, జనసేన శ్రేణులు కోరుకుంటున్నాయి.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ