జనసేనలో విలువలు ఎక్కడ? ఆవిరి అవుతున్న అధినాయకుడి సిద్ధాంతాలు

పిఠాపురం : విలువలతో కూడిన ప్రజాపాలన అందించాలనే లక్ష్యంతో జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాగిస్తున్న పాలనకు ఆయన సొంత నియోజకవర్గ పరిధిలోని కుమారపురం గ్రామంలో వలస నేతల వికృత చేష్టలు తీవ్ర కళంకం తెస్తున్నాయి. 2014 పార్టీ ఆవిర్భావం నుంచి అహర్నిశలు కష్టపడి జెండా మోసిన సీనియర్ జనసైనికులను, బూత్, వార్డు ఇన్ఛార్జీలను తొక్కేస్తూ.. నిన్నగాక మొన్న వైఎస్సార్సీపీ, టీడీపీల నుంచి పదవుల కోసం వలస వచ్చి కండువాలు కప్పుకున్న ‘అవకాశవాద నేతలు’, సైట్ బ్రోకర్లు గ్రామంలో విచ్చలవిడిగా పెత్తనం చెలాయిస్తుండటం తీవ్ర ఆగ్రహజ్వాలలు రేపుతోంది. ఇటీవల జరిగిన పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల్లో ‘ఏకగ్రీవంగా ఎన్నికైన చైర్మన్ దగ్గర నుండి ‘మందు పార్టీ’ పేరిట దండుకొని నాటకాలు ఆడటం, నిరుపేద కార్యకర్తల పుట్టినరోజులు, పెళ్లిరోజుల సాకుతో బలవంతపు కేక్ కటింగ్‌లు చేయించి వారి జేబులు ఖాళీ చేయించడం వంటి నీచ సంస్కృతిని తెరపైకి తెచ్చి పవన్ కళ్యాణ్ ఆశయాలకు పూర్తిగా తూట్లు పొడుస్తున్నారు. అధికారులను సైతం గుప్పెట్లో పెట్టుకుని, గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా పాత నాయకులకు కనీస సమాచారం ఇవ్వకుండా, జగ్గయ్యచెరువు సెటిల్మెంట్ రాయబారుల నీడలో నడుస్తున్న ఈ 'వలస ముఠా' పార్టీ ప్రతిష్టను నిలువునా దిగజారుస్తోంది. కేవలం అధికార భోగం దండుకోవడానికే వచ్చిన ఇలాంటి సెటిల్మెంట్ రాయబారుల వల్ల మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికి తీవ్ర అన్యాయం జరగడమే కాకుండా, భవిష్యత్తులో గ్రామస్థాయిలో పార్టీకి కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని సీనియర్ జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక నియోజకవర్గ, జిల్లా నాయకత్వంతో పాటు అధినేత పవన్ కళ్యాణ్ గారు తక్షణమే స్పందించి, పవిత్రమైన పార్టీ సిద్ధాంతాలకు ముసుగువేసి దందాలు సాగిస్తున్న ఈ ‘వలస ముఠా’పై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుని, మొదటి నుంచి కష్టపడిన నిజమైన జనసైనికులకు సముచిత స్థానం, గుర్తింపు అందించి న్యాయం చేయాలని కుమారపురం సీనియర్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

పిఠాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం.. సామాన్యుడికా? లేక బడా నాయకుల కనుసన్నల్లో డాక్టర్ కేనా? – తెరవెనుక రాజకీయాలపై జనసైనికుల్లో తీవ్ర ఆగ్రహం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ