ఫిర్యాదులు పరిష్కారం కానప్పుడు పాడా కార్యాలయం ఎందుకు పాడా బోర్డు తీసి జనసేన బోర్డు పెట్టుకోండి..
పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చేసిన సర్వే నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, దళిత సంఘాల నాయకులు బుధవారం పాడా కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఫిర్యాదులు చేస్తున్న వారిని అధికారులు శత్రువులుగా చూస్తున్నారని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా రామకృష్ణ ఏసుదాసు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వద్ద ఫిర్యాదు చేసినప్పటికీ సర్వే, నిర్ధారణ పూర్తికాకముందే అక్రమణదారులు పెన్సింగ్ వేయడం దారుణమన్నారు. జగయ్యచెరువు సర్వే రిపోర్టును బయటపెట్టాలని డిమాండ్ చేశారు. భూకబ్జాలను అరికట్టేందుకు డ్రోన్ కెమెరాలతో సర్వే నిర్వహిస్తామని పాడా పీడీ ప్రకటించారని, ఆ సర్వే వివరాలపై ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పకుండా ముఖం చాటేయడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అవినీతి పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు. భూ, ఇసుక, మైనింగ్, రేషన్, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరుగుతున్నాయని, వీటిపై ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో వీధిలైట్లు లేకపోవడం, డ్రైనేజీల్లో మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదన్నారు.అభివృద్ధి పనులను పక్కనపెట్టి దోపిడీకి పెద్దపీట వేస్తున్నారని ఆయన విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన పాడా కార్యాలయంలో ఫిర్యాదులు చేసినా పరిష్కారం చూపకుండా ఫిర్యాదుదారులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. భూకబ్జాలను డ్రోన్ కెమెరాలతో నియంత్రిస్తామని చెప్పిన పీడీ ఇప్పుడు అదే అంశంపై స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు.
కూటమి ప్రభుత్వం, అధికారుల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానం చెబుతారని రామకృష్ణ ఏసుదాసు హెచ్చరించారు. కార్యక్రమంలో దళిత నాయకులు ఖండవల్లి సుబ్బారావు, కె. మారేస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment