గుండె ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు.......మెడ్‌వే సంజీవని ఆసుపత్రి ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ

కాకినాడ :  ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు కాకినాడలోని మెడ్‌వే సంజీవని ఆసుపత్రి ఆధ్వర్యంలో భారీ పాదయాత్రను విజయవంతంగా నిర్వహించారు. “ఆరోగ్యకరమైన గుండె – ఆరోగ్యకరమైన కుటుంబం – ఆరోగ్యకరమైన సమాజం” అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని శాసనమండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ, కాకినాడ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ తలాటం సత్య, శాసనమండలి సభ్యుడు పేరాభత్తుల రాజశేఖర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అనంతరం ఆసుపత్రి ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర జిల్లా పరిషత్ కేంద్రం వరకు కొనసాగింది. అనంతరం ప్రజలకు అవగాహన కలిగించే విధంగా గుండె ఆగిపోయిన సమయంలో చేసే గుండె-ఊపిరితిత్తుల పునరుజ్జీవన ప్రక్రియను ఎలా చేయాలో వైద్యులు వివరించారు.

ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు కర్రి పద్మశ్రీ, తలాటం సత్య, పేరాభత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు ఉరుకుల పరుగుల జీవితంలో పడి సంపాదనపైనే దృష్టి సారిస్తూ ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శరీరంలో నిరంతరం పనిచేసే అత్యంత కీలక అవయవం గుండె అని, దాని సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు.

ధూమపానం, మద్యపానం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, శారీరక శ్రమ లోపించడం, ఊబకాయం, అధిక రక్తపోటు, మానసిక ఒత్తిడి వంటివి గుండె సమస్యలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ రోజూ శారీరక శ్రమ చేయాలని సూచించారు.

ఛాతీలో లేదా శరీరంలో ఏదైనా అసౌకర్యం, నొప్పి వస్తే అంతర్జాలంలో వెతికి సొంతంగా మందులు వాడటం లేదా గ్యాస్ సమస్యగా భావించి ఉపేక్షించడం ప్రాణాలకే ప్రమాదకరమని వక్తలు హెచ్చరించారు. ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించి, సరైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు.

ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఇటువంటి చక్కటి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టిన మెడ్‌వే సంజీవని ఆసుపత్రి యాజమాన్యాన్ని అతిథులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వార్డు ఇన్‌చార్జ్ శ్రీమన్నారాయణ, గోవిందు, ఆసుపత్రి కేంద్ర అధికారి, వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాదయాత్రను విజయవంతం చేశారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

పిఠాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం.. సామాన్యుడికా? లేక బడా నాయకుల కనుసన్నల్లో డాక్టర్ కేనా? – తెరవెనుక రాజకీయాలపై జనసైనికుల్లో తీవ్ర ఆగ్రహం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ