పోలీసులు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా విధులు నిర్వహించాలి.....రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

క్రమశిక్షణ, సేవా దృక్పథంతో ప్రజలకు భద్రత కల్పించాలి

280 మంది పోలీస్ కానిస్టేబుళ్ల దీక్షాంత పరేడ్‌లో పాల్గొన్న మంత్రి సుభాష్
కాకినాడ జిల్లా : ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ 3వ బెటాలియన్, కాకినాడలో 2025-26 బ్యాచ్ రెండో బేసిక్ ట్రైనింగ్ పోలీస్ కానిస్టేబుల్ (SCTPC) దీక్షాంత పరేడ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరై పరేడ్‌ను పరిశీలించి సెల్యూట్ స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ తొమ్మిది నెలల కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న 280 మంది పోలీస్ కానిస్టేబుళ్లకు అభినందనలు తెలిపారు. పోలీస్ ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాదని, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అంకితమయ్యే గొప్ప బాధ్యత అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తోందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ప్రతి పోలీసు సిబ్బంది నిజాయితీ, క్రమశిక్షణ, సేవా భావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న విలువలు, నైపుణ్యాలు భవిష్యత్ సేవల్లో మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు.
కానిస్టేబుల్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి డిప్యూటీ కమాండెంట్ స్థాయికి ఎదిగిన శ్రీ వానసెట్టి సుబ్బారావును మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. కృషి, పట్టుదల, అంకితభావంతో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని ఆయన ప్రయాణం నిరూపిస్తోందన్నారు.
అనంతరం 3వ బెటాలియన్ కమాండెంట్ శ్రీ కె.ఎన్. కుమార్ మాట్లాడుతూ, శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లు పోలీసు శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా పని చేయాలని సూచించారు. శారీరక దృఢత్వంతో పాటు చట్టాలపై అవగాహన, ప్రజలతో మమేకమయ్యే తీరు, బాధ్యతాయుతమైన సేవా దృక్పథం పోలీసు ఉద్యోగంలో అత్యంత ముఖ్యమని చెప్పారు.
ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకోవడం ప్రతి పోలీసు సిబ్బంది ప్రధాన లక్ష్యంగా ఉండాలని, విధి నిర్వహణలో పారదర్శకత, నిజాయితీ, నిబద్ధతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను సేవా జీవితమంతా ఆచరిస్తూ ప్రజలకు భద్రత, భరోసా కల్పించాలని కోరారు.
కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్యాడెట్లకు బహుమతులు ప్రదానం చేశారు. పోలీసు బ్యాండ్, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం అధికారులు, శిక్షణ పూర్తి చేసిన కానిస్టేబుళ్లతో మంత్రి సుభాష్ ముచ్చటించి వారి భవిష్యత్ సేవలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గరికపాటి, ఎమ్మెల్సీ పేరావత్తుల రాజశేఖర్, ఎమ్మెల్సీ కర్రీ పద్మజ, కాకినాడ రూరల్ టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పిల్లి అనంతలక్ష్మి, డిప్యూటీ కమాండెంట్లు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, శిక్షక బృందం, క్యాడెట్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

పిఠాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం.. సామాన్యుడికా? లేక బడా నాయకుల కనుసన్నల్లో డాక్టర్ కేనా? – తెరవెనుక రాజకీయాలపై జనసైనికుల్లో తీవ్ర ఆగ్రహం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ