రాజధాని పవర్ ప్రైవేట్ పరం.. కూటమి ప్రభుత్వంపై నాగమణి విమర్శలు
కాకినాడ: రాజధాని ప్రాంతంలో విద్యుత్ పంపిణీ, రిటైల్ సరఫరాను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం యోచిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి విమర్శించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణం పేరుతో ప్రజలపై అదనపు భారాన్ని మోపే ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థకు సంబంధించి టెండర్లు ఆహ్వానించడం చూస్తుంటే ఇప్పటికే ఈ వ్యవస్థను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రక్రియకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోందన్నారు. రాజధాని ప్రాంతంలో విద్యుత్ నెట్వర్క్ అభివృద్ధి, ఆపరేషన్స్, నిర్వహణ, బిల్లింగ్, కలెక్షన్ వంటి బాధ్యతలను కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే భవిష్యత్లో ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని నాగమణి పేర్కొన్నారు. డొమెస్టిక్, కమర్షియల్, ప్రభుత్వ రంగాలకు విద్యుత్ పంపిణీ ప్రైవేట్ సంస్థల ఆధీనంలోకి వెళితే సామాన్యులు, వ్యాపారులు ఎదుర్కొనే ఇబ్బందులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. చంద్రబాబు నాలుగు దఫాల పాలనలో కీలకమైన వ్యవస్థలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విధానం కొనసాగుతోందని నాగమణి విమర్శించారు. తన అనుయాయులకు కాంట్రాక్టులు అప్పగించేందుకు మార్గాలు సుగమం చేస్తున్నారంటూ ఆమె ఆరోపించారు. అయితే ఇప్పటికే అధిక విద్యుత్ బిల్లులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై మరింత భారం మోపే నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. రాజధాని ప్రాంతంలో విద్యుత్ వంటి మౌలిక వసతులపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాలని నాగమణి డిమాండ్ చేశారు.

Comments
Post a Comment