అక్రమంగా అరెస్ట్ చేసిన నంద్యాల ఐ న్యూస్ జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలి : APJF
కాకినాడ : రాష్ట్ర మంత్రి ఫరూఖ్ కుమారులపై ఐ న్యూస్ చానల్ లో కథనం ప్రసారం చేసిన నంద్యాల రిపోర్టర్స్ ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని కాకినాడ జిల్లా అక్రెడిటేషన్ కమిటీ సభ్యులు, APJF నాయకులు వీధి సాయినాథ్, రెడ్డిపల్లి రాజేశ్ తీవ్రంగా ఖండించారు. నంద్యాలలో జరుగుతున్న విషయాలను వెలుగులోకి తీసుకువస్తు ఐ న్యూస్ రిపోర్టర్స్ ప్రసారం చేసిన అంశాలలో అభ్యంతరాలు ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలియజేయవచ్చని అయితే అందుకు విరుద్ధంగా జర్నలిస్టులపై దాడులకు బెదిరింపులకు తెగబడటం దారుణం అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే మీడియా వ్యవస్థ లోని లోపాలను వెలుగులోకి తీసుకువచ్చినప్పుడు సరైన రీతిలో స్పందించక పోగా ఇటువంటి చర్యలకు పాల్పడటాన్నీ తప్పుపట్టారు. నచ్చని వార్తలపై ఖండన ఇవ్వొచ్చని, ఆధారాలు లేకుంటే పరువునష్టం దావా కూడా వేయొచ్చనీ అన్నారు. అలా కాకుండా అధికార పార్టీ నేతల అండతోనే వార్తలు ప్రసారం చేసిన జర్నలిస్టులుపై అన్యాయంగా కేసులు పెట్టి అర్ధరాత్రి అదుపులోకి తీసుకొని ఇప్పటి వరకు అరెస్ట్ చూపించక పోవడం సిగ్గు చేటనీ ఆరోపించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డీజీపీ వెంటనే స్పందించి అరెస్ట్ చేసిన జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలని, జర్నలిస్టుల పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Comments
Post a Comment