గ్రూప్ - 1 నియామకాల్లో భారీ కుంభకోణం: సుంకర పావని
కాకినాడ సిటీ: వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 నియామకాల్లో చరిత్రలో లేనివిధంగా భారీ అవకతవకలు, అవినీతి జరిగాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్ ఆరోపించారు. గ్రూప్-1 నియామకాలకు సంబంధించి సిట్ దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయని ఆమె పేర్కొన్నారు. 2018 డిసెంబర్ 31న జారీ చేసిన నోటిఫికేషన్ నుంచి నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో అభ్యర్థులను సామూహికంగా మోసం చేసేలా వ్యవహారం సాగిందని పావని ఆరోపించారు. ఏపీపీఎస్సీ జవాబు పత్రాలను మూడుసార్లు ఎందుకు మూల్యాంకనం చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. 87 మంది అభ్యర్థుల మూల్యాంకన స్లిప్పుల్లో చీఫ్ ఎగ్జామినర్ సంతకాలలో దిద్దుబాట్లు ఎందుకు జరిగాయో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.నిబంధనలకు విరుద్ధంగా ఛైర్మన్ అనుమతి లేకుండా ప్రైవేట్ వ్యక్తులకు డిజిటల్ మూల్యాంకనం బాధ్యతలు ఎందుకు అప్పగించారో చెప్పాలని పావని ప్రశ్నించారు. డిజిటల్, మాన్యువల్ మూల్యాంకనాల్లో మార్కుల తేడాలు ఎందుకు వచ్చాయో స్పష్టం చేయాలన్నారు. కోర్టు ఆదేశాలతో హాయ్‌ల్యాండ్ రిసార్ట్స్‌లో నిర్వహించిన మాన్యువల్ మూల్యాంకనంలో ఒరిజినల్ ఓఎంఆర్ బార్‌కోడ్ షీట్లను వినియోగించి, విజయవాడలో డూప్లికేట్ ఓఎంఆర్ షీట్లపై పేపర్లు చదవకుండానే ముందుగా నిర్ణయించిన మార్కులు వేసి బబ్లింగ్ చేశారని ఆమె ఆరోపించారు.డీఎస్సీ అంశంపై పదేపదే మాట్లాడుతున్న జగన్‌రెడ్డి గ్రూప్-1 వ్యవహారంపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని పావని ప్రశ్నించారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ జగన్ తన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి సీబీఐ విచారణను ఎదుర్కోవాలని ఆమె డిమాండ్ చేశారు.
Comments
Post a Comment