శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, పెన్నులు, పెన్నలు బిస్కెట్ ప్యాకెట్లు, చాక్లెట్లు, స్వీట్లు పంపిణీ
కాకినాడ రూరల్ : మండల పరిధిలోని రమణయ్యపేట మురళీధర్‌నగర్ మండల పరిషత్ ప్రాథమిక (ఎంపీపీ) పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గురువారం శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. సేవా సంస్థ అధినేత సాయిరాం నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లతో పాటు బిస్కెట్ ప్యాకెట్లు, చాక్లెట్లు, స్వీట్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కాకినాడ రూరల్ మండలం డాక్టర్స్ కమిటీ అధ్యక్షుడు రాయుడు అనిల్ చేతుల మీదుగా విద్యార్థులకు ఈ విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాయుడు అనిల్ మాట్లాడుతూ జాతీయ పండగ రోజున పేద విద్యార్థుల చదువుకు ప్రోత్సాహంగా విద్యా సామగ్రిని అందజేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. సాయిరాం చేస్తున్న సామాజిక సేవలు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. ఎందరో మహానీయుల త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తుచేశారు. విద్యార్థులు చిన్నతనం నుంచే మంచి లక్ష్యాలను పెట్టుకుని, కష్టపడి చదివి భవిష్యత్తులో దేశాభివృద్ధికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక పంచాయతీ సభ్యులు, ట్రస్ట్ ప్రతినిధులు ఎం. మూర్తి, జ్యోతుల కొండలరావు, యు. సత్య, కార్తీక్, చిరంజీవి, కే. సతీష్, శ్రీనివాస్ చౌదరి, సందీప్, కళ్యాణ్, శివ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment