ఆర్ఆర్‌బీహెచ్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ‘సంకల్ప్’ మెటీరియల్ పంపిణీ
పిఠాపురం: పిఠాపురంలోని ఆర్ఆర్‌బీహెచ్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను డీఐఈఓ డా. జ్యోతుల రాంబాబు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యా కార్యకలాపాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. రాబోయే పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ఉపయోగకరమైన ‘సంకల్ప్’ స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకుని పాఠ్యాంశాలను క్రమబద్ధంగా చదివి పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ ప్రస్తుత సమయాన్ని సద్వినియోగం చేసుకుని ‘సంకల్ప్’ మెటీరియల్‌ను క్రమం తప్పకుండా చదవాలని, పబ్లిక్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ఇది మార్గదర్శిగా ఉపయోగపడుతుందని తెలిపారు. పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమని, కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ డి.ఆర్.కె. రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల పరీక్షా సన్నద్ధతకు ‘సంకల్ప్’ మెటీరియల్ ఎంతో ఉపయోగకరమని అన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వాన్ని తీసుకుని ప్రతిరోజూ ప్రణాళికాబద్ధంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. తమ లక్ష్యాలను ముందుగానే నిర్దేశించుకుని, పబ్లిక్ పరీక్షలను విజయానికి తొలి మెట్టుగా భావించి క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు రామకృష్ణ, డి.వి.వి. నాగేశ్వర్‌రెడ్డి, కాశీ విశ్వనాథ్, ఇ.జె. డేనియల్, చిన్నబ్బాయి, లలిత మేరీతో పాటు ఇతర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. డీఐఈఓ సందర్శన, విద్యార్థులకు ఇచ్చిన మార్గదర్శకత్వం, ‘సంకల్ప్’ మెటీరియల్ పంపిణీతో విద్యార్థుల్లో పరీక్షలపై మరింత నమ్మకం, ఉత్సాహం ఏర్పడింది.

Comments
Post a Comment