సామాజిక సేవకు అంతర్జాతీయ గుర్తింపు అంజనేయులురెడ్డికి ‘గ్లోబల్ ఇన్‌స్పిరేషన్’ అవార్డు

కాకినాడ జిల్లా : సంపాదనలో కొంత భాగాన్ని సమాజ సేవకు కేటాయిస్తూ, చిరు వ్యాపారం చేసుకుంటూనే నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాకినాడకు చెందిన ‘సేవారత్న’ అనపాల అంజనేయులు రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ప్రజా, సామాజిక సేవా రంగాల్లో ఆయన చేస్తున్న సేవలను గుర్తిస్తూ ‘గ్లోబల్ ఇన్‌స్పిరేషన్ ఇంటర్నేషనల్ అవార్డు–2026’కు ఎంపిక చేశారు. పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్, మలేషియాలోని తెలుగు ఎక్స్‌పాట్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందిస్తున్నాయి. సెప్టెంబరు 9న మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగే కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేయనున్నారు. చిరు వ్యాపారం ద్వారా జీవనం సాగిస్తున్న అంజనేయులు రెడ్డి, తనకు చేతనైనంత మేర సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో 365 రోజులూ బాటసారులకు తాగునీరు అందిస్తున్నారు. ఎండ, వానతో సంబంధం లేకుండా బాటసారుల దాహం తీర్చేందుకు తాగునీటి సదుపాయం కల్పిస్తున్నారు. అంతేకాకుండా పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పెన్నులు, పుస్తకాలు అందిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తూ తన వంతు సహాయాన్ని అందిస్తున్నారు. ప్రచార ఆర్భాటాలకు దూరంగా, తనకు ఉన్న పరిమిత వనరులతోనే నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అంజనేయులు రెడ్డి సేవలను గుర్తించి అంతర్జాతీయ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక సాధారణ చిరు వ్యాపారి సమాజం కోసం నిరంతరం సేవ చేస్తూ అంతర్జాతీయ వేదికపై గుర్తింపు పొందడం అభినందనీయమని పేర్కొంటున్నారు. కాకినాడకు చెందిన సామాజిక కార్యకర్తకు మలేషియాలో అంతర్జాతీయ పురస్కారం లభించడం పట్ల స్థానికులు, ఆయన సేవలను అభినందిస్తున్న వారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

పిఠాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం.. సామాన్యుడికా? లేక బడా నాయకుల కనుసన్నల్లో డాక్టర్ కేనా? – తెరవెనుక రాజకీయాలపై జనసైనికుల్లో తీవ్ర ఆగ్రహం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ