మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.. లక్ష్యాలపై దృష్టి పెట్టండి - సిఐ వెంకటేశ్వరరావు
కాకినాడ రూరల్ : మాదకద్రవ్యాల వినియోగానికి విద్యార్థులు దూరంగా ఉండాలని, చెడు స్నేహాలకు లోనుకాకుండా తమ లక్ష్యాలపై దృష్టి సారించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఈగల్ సీఐ జి. వెంకటేశ్వరరావు సూచించారు. ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినికేతన్ జూనియర్ కాలేజీలో సోమవారం “ఈగల్ పల్లెబాట – రచ్చబండ ద్వారా విద్యార్థులతో ముఖాముఖి” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఈగల్ సీఐ జి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వల్ల విద్యార్థుల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుతో పాటు వారి కుటుంబాలు, సమాజంపై తీవ్ర దుష్పరిణామాలు ఏర్పడతాయని వివరించారు. ముఖ్యంగా గంజాయి, మత్తు పదార్థాలు, ఇతర మాదకద్రవ్యాలకు యువత పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. చెడు స్నేహాలకు ఆకర్షితులు కాకుండా విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలని తెలిపారు. విద్యార్థులు మాదకద్రవ్యాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఎవరైనా మాదకద్రవ్యాలను వినియోగిస్తున్నా, విక్రయిస్తున్నా లేదా అక్రమంగా రవాణా చేస్తున్నా తమ దృష్టికి వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాజంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్ 1972కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటంతో పాటు తమ చుట్టూ ఉన్న వారిని కూడా అప్రమత్తం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంద్రపాలెం ఎస్సై ఎం. వీరబాబు, ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఈగల్ సిబ్బంది, శాంతినికేతన్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ వి. రాజారావు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, కాకినాడ రూరల్ క్లస్టర్ ఇంచార్జ్ వాసంశెట్టి అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment