కాకినాడ అపోలోలో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతం........62 ఏళ్ల వృద్ధురాలికి పునర్జన్మ


కాకినాడ : తీవ్ర గుండె సంబంధిత సమస్యతో ప్రాణాపాయ స్థితిలో చేరిన 62 ఏళ్ల వృద్ధురాలికి కాకినాడ అపోలో ఆసుపత్రి వైద్యులు అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. సాధారణంగా మెట్రో నగరాల్లో మాత్రమే సాధ్యమయ్యే ఈ చికిత్సను కాకినాడలోనే విజయవంతంగా పూర్తి చేసి వైద్య బృందం తమ నైపుణ్యాన్ని చాటుకుంది. తీవ్రమైన ఛాతీ నొప్పి, ఆయాసంతో ఆసుపత్రిలో చేరిన సదరు మహిళను పరీక్షించగా, శరీరానికి రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళం 'అయోర్టా' చీలిపోయినట్లు తేలింది. దీనితో పాటు గుండెకు రక్తాన్ని చేరవేసే మరో రెండు ప్రధాన రక్తనాళాల్లోనూ బ్లాకేజీలు ఉన్నట్లు గుర్తించారు. రక్తపోటు పెరిగితే ప్రాణాలకే ముప్పు వాటిల్లే అత్యవసర పరిస్థితి కావడంతో, ఇతర నగరాలకు తరలించే సమయం లేక వైద్యులు వెంటనే శస్త్రచికిత్సకు సిద్ధమయ్యారు.ప్రముఖ కార్డియోవాస్కులర్ & థొరాసిక్ సర్జన్ డాక్టర్ పుష్యమి వేములపల్లి నేతృత్వంలో దాదాపు 7 నుంచి 8 గంటల పాటు ఈ ఆపరేషన్ సాగింది. వైద్యులు చీలిపోయిన ప్రధాన రక్తనాళం భాగాన్ని తొలగించి కృత్రిమ గ్రాఫ్ట్ అమర్చడంతో పాటు (‘సుప్రా కొరోనరీ అసెండింగ్ అయోర్టా రీప్లేస్‌మెంట్’), బైపాస్ సర్జరీని (CABG) విజయవంతంగా పూర్తి చేశారు.రోగి వయస్సు పైబడటం, కణజాలం బలహీనంగా ఉండటం, ముందు నుంచే తీవ్రమైన ఆస్తమా సమస్య ఉండటం వైద్యులకు పెద్ద సవాలుగా మారింది. అయినప్పటికీ కార్డియాలజీ, అనస్థీషియా, క్రిటికల్ కేర్, పల్మనాలజీ, ఐసీయూ , ఓటీ మరియు నర్సింగ్ బృందాల సమష్టి కృషితో ఆపరేషన్ విజయవంతమైంది. ప్రస్తుతం ఆ మహిళ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కాకినాడ వంటి నగరంలో అంతర్జాతీయ స్థాయి అత్యాధునిక సాంకేతికత, అనుభవజ్ఞులైన వైద్య బృందం అందుబాటులో ఉండటం వల్లే 'గోల్డెన్ అవర్'లో రోగి ప్రాణాలు కాపాడగలిగామని వైద్యులు పేర్కొన్నారు.


Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

పిఠాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం.. సామాన్యుడికా? లేక బడా నాయకుల కనుసన్నల్లో డాక్టర్ కేనా? – తెరవెనుక రాజకీయాలపై జనసైనికుల్లో తీవ్ర ఆగ్రహం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ