మానవత్వం చాటిన ప్రవీణ్ చక్రవర్తి.. చిన్నారి వైద్యానికి రూ.3 లక్షల సాయం
కాకినాడ రూరల్ : అరుదైన ఎస్ఎంఎస్ వ్యాధితో బాధపడుతున్న నాలుగేళ్ల చిన్నారి మోజేష్ రాయల్ వైద్యానికి భారీగా ఖర్చు అవుతుండటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి విద్యావేత్త, సామాజికవేత్త, కేటీసీ విద్యాసంస్థల అధినేత అండగా నిలిచారు. చిన్నారి పరిస్థితిని తెలుసుకున్న ఆయన మానవతా దృక్పథంతో స్పందించి కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందించారు. కాకినాడ ఇంద్రపాలెం ప్రాంతానికి చెందిన మోజేష్ రాయల్ కొంతకాలంగా అరుదైన ఎస్ఎంఎస్ వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యం, మందులకు భారీగా ఖర్చు అవుతుండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమయానికి అవసరమైన చికిత్స, మందులు అందకపోతే చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎస్ఎంఎస్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కుటుంబాలు కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టి తమ పిల్లలకు అవసరమైన వైద్యం, ఖరీదైన మందులు అందించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరిన విషయం తెలిసిందే. వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు కోట్ల రూపాయల వరకు వైద్య ఖర్చులు అవసరమవుతున్నాయని, సాధారణ కుటుంబాలు అంతటి భారాన్ని భరించలేకపోతున్నాయని బాధిత కుటుంబాలు పేర్కొంటున్నాయి. చిన్నారుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ‘ఆపరేషన్ పునర్విక’ కార్యక్రమాన్ని త్వరితగతిన ప్రారంభించి, అవసరమైన వైద్యం, మందులు అందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు బాధిత కుటుంబాలు కలెక్టర్‌ను కలిసి తమ సమస్యలను వివరించి తక్షణ సహాయం అందించాలని కోరాయి. ఇదిలా ఉండగా మోజేష్ రాయల్ కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందించిన విద్యావేత్తకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో అందించిన ఈ సహాయం తమకు ఎంతో భరోసానిచ్చిందని పేర్కొన్నారు. చిన్నారి వైద్యానికి భారీగా ఖర్చు అవుతున్న నేపథ్యంలో మరికొందరు దాతలు, స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు, పారిశ్రామికవేత్తలు, విద్యాసంస్థల నిర్వాహకులు, సామాజికవేత్తలు ముందుకు వచ్చి తమకు చేతనైనంత సాయం చేయాలని బాధిత కుటుంబాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రభుత్వ సహాయంతో పాటు సమాజం నుంచి లభించే మద్దతు కూడా చిన్నారి వైద్యానికి ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు సమయం ఎంతో కీలకమైనందున ప్రభుత్వం వేగంగా స్పందించి అవసరమైన వైద్య సదుపాయాలు, మందులు అందించడంతో పాటు దాతలు కూడా ముందుకు రావాలని కోరుతున్నారు.

Comments
Post a Comment