అనపాల అంజనేయులు రెడ్డికి ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా–నేషనల్ అవార్డు
కాకినాడ జిల్లా : సామాజిక, ప్రజా సేవా రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న కాకినాడ రూరల్ ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త అనపాల అంజనేయులు రెడ్డికి ప్రతిష్ఠాత్మక ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా–నేషనల్ అవార్డు 2026’ లభించింది. ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న సేవా కార్యక్రమాలు, సమాజ సేవ పట్ల అంకితభావం, నాయకత్వాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేశారు. ఆగస్టు 13న హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. అనంతరం రాజమహేంద్రవరంలోని ప్రధాన కార్యాలయంలో పాన్ ఇండియన్ సోషల్ కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అద్దంకి రాజా యోనా సమక్షంలో ‘కళారత్న’ డాక్టర్ కొండా నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీ చేతుల మీదుగా అనపాల అంజనేయులు రెడ్డికి అవార్డును ప్రదానం చేశారు. కాకినాడ రూరల్ ప్రాంతానికి చెందిన అంజనేయులు రెడ్డి ప్లాస్టిక్ సామగ్రి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. తన వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రజా సేవకు కేటాయిస్తూ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ప్రతిరోజూ తాగునీటి సేవలు అందిస్తూ ప్రజల ప్రశంసలు పొందుతున్నారు. తనకు వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని సమాజ సేవకు వినియోగిస్తూ నిరంతరం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన పలు సంస్థలు గతంలోనూ వివిధ పురస్కారాలతో సత్కరించాయి. తాజాగా ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా–నేషనల్ అవార్డు 2026’ అందుకోవడంతో సామాజిక సేవకులు, స్థానికులు, ప్రజాప్రతినిధులు అంజనేయులు రెడ్డికి అభినందనలు తెలిపారు.ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని, తనకు లభించిన ఈ పురస్కారం మరింత బాధ్యతను పెంచిందని అంజనేయులు రెడ్డి తెలిపారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని పేర్కొన్నారు.


Comments
Post a Comment