పిల్లల ప్రాణాలతో చెలగాటమా.. జన్మభూమి పార్కులో ప్రమాదకర ఆట పరికరాలు

కాకినాడ : నగర ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో అభివృద్ధి చేసిన జన్మభూమి పార్కులో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఆట పరికరాలు ప్రస్తుతం ప్రమాదకరంగా మారాయి. పిల్లలు ఎక్కువగా వినియోగించే జారుడు బల్లలు, ఊయలలు తుప్పుపట్టి, కొన్ని చోట్ల ఇనుప షీట్లు చిల్లు పడిన స్థితిలో ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పార్కులోని ఓ జారుడు బల్ల  పైన భాగంలో పెద్ద రంధ్రం ఏర్పడగా, మరో ఆట పరికరం పైభాగం పూర్తిగా తుప్పుపట్టి బలహీనంగా కనిపిస్తోంది. ఊయలల గొలుసులు, సీట్లు కూడా దెబ్బతిన్న స్థితిలో ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయం నెలకొంది. వేసవి సెలవులు కావడంతో ప్రతిరోజూ వందలాది మంది చిన్నారులు తల్లిదండ్రులతో కలిసి పార్కుకు వస్తున్నారు. ఈ క్రమంలో పిల్లలు ఆడుకుంటున్న సమయంలో పరికరాలు విరిగిపోతే తీవ్ర గాయాలు అయ్యే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"పిల్లలను పార్కుకు తీసుకొస్తే ఆనందంగా ఆడుకోవాల్సింది పోయి, ఏ పరికరం ఎప్పుడు విరిగిపోతుందోనన్న భయంతో కంటిమీద కునుకు లేకుండా చూడాల్సి వస్తోంది. అధికారులు ప్రమాదం జరిగిన తర్వాత స్పందించకుండా ముందుగానే మరమ్మతులు చేపట్టాలి" అని పలువురు తల్లిదండ్రులు కోరుతున్నారు.

ప్రజల వినోదం, చిన్నారుల భద్రత కోసం ఏర్పాటు చేసిన పార్కులో ప్రమాదకరంగా మారిన ఆట పరికరాలను వెంటనే తొలగించి, కొత్తవి ఏర్పాటు చేయాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరిగేలోపే సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



Comments

Popular posts from this blog

ఏపీకి వర్ష హెచ్చరిక.. కోస్తాంధ్రలో భారీ వర్షాల ముప్పు

ప్రతిభకు ప్రోత్సాహం.. జూన్ 7న స్కాలర్‌షిప్ కోసం సత్య ట్రస్ట్ పరీక్ష

ద్వారంపూడి హయాంలో కాకినాడ అరాచకాలకు నిలయం: టీడీపీ నేతలు